హర్మూజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’.. అమెరికా భారీ ఆపరేషన్

  • చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యం
  • ఇది మానవతా చర్య అని, అడ్డుకుంటే తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరిక
  • ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్
  • అమెరికా చర్య కాల్పుల విరమణ ఉల్లంఘనేనని ఇరాన్ స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న విదేశీ వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు.

ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన ట్రంప్ ఈ వివాదంతో ఏమాత్రం సంబంధం లేని అనేక దేశాల నౌకలు అక్కడ చిక్కుకుపోయాయని పేర్కొన్నారు. వారిని ‘అమాయక బాధితులు’గా అభివర్ణించారు. ఆ నౌకల్లోని సిబ్బంది వద్ద ఆహారం, నిత్యావసరాలు అడుగంటుతున్నాయని, ఇది పూర్తిగా మానవతా దృక్పథంతో చేపడుతున్న చర్య అని వివరించారు.

ఈ ఆపరేషన్‌కు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) పూర్తి మద్దతు ప్రకటించింది. గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్లు, 100కు పైగా విమానాలు, 15,000 మంది సైనికులు ఇందులో పాల్గొంటారని తెలిపింది. ఇదే సమయంలో, ఈ మానవతా సహాయక చర్యలకు ఎవరైనా అడ్డుతగిలితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు, ఇరాన్‌తో తమ ప్రతినిధులు చాలా సానుకూల చర్చలు జరుపుతున్నారని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. అయితే, కొన్ని రోజుల క్రితమే ఇరాన్ ప్రతిపాదించిన 14-సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ 'ఆమోదయోగ్యం కాదు' అని తోసిపుచ్చారు. తాజా పరిణామాలపై స్పందించిన ఇరాన్, హర్మూజ్ జలసంధిలో అమెరికా జోక్యాన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది.

Donald Trump
Hormuz Strait
Project Freedom
US Central Command
Iran
Foreign Trade Vessels
Maritime Security
Middle East Tensions
Humanitarian Operation
Trump Iran relations

More Telugu News